తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం ఉన్నప్పుడూ ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది.. కానీ నిజంగా ఖర్చులేని ఇజం ఏదైనా ఉందంటే.. అది టూరిజమే అని కూనంనేని పేర్కొన్నారు. చంద్రబాబు నాడు చెప్పిన మాటే నిజమంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సీఎం స్పందించారు.
ఏ ఇజం లేదని నేను అంటే కమ్యూనిస్టులు నాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఖర్చు లేని ఇజం టూరిజమేనని స్టేట్ మెంట్ ఇచ్చారు. నా మాటలు, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందని నవ్వుతూ చంద్రబాబు అన్నారు. ఇప్పుడు అంతా సమయం లేదని, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని సీఎం పేర్కొన్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. కలెక్టర్లు జిల్లాల వారిగా టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాలి.