ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు నిర్వహిస్తున్న “ఆడుదాం ఆంధ్ర” క్రీడ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్ లో సీఎం వైఎస్ జగన్ లాంచనంగా ప్రారంభించారు. డిసెంబర్ 26 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజులపాటు జరిగే ఈ క్రీడా సంబరాలలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాట్మెంటన్ ఆటలు ఉన్నాయి.
ఈ ఐదు క్రీడాంశాల్లో 34.19 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి క్రీడాకారులకు 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ చేశారు సీఎం జగన్. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ‘ఆడుదాం ఆంధ్ర’ ప్రోగ్రాం ని ప్రారంభించిన సీఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా.. సీఎం బ్యాటింగ్ చేశారు. ఇక మంత్రి రోజా కీపింగ్ చేశారు.