ముస్లిం సోదరీ, సోదరులకు సీఎం వైయస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం అన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా, రాగ ద్వేషాలకు అతీతంగా ముస్లింలు అందరూ ఈ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారని తెలిపారు.
అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక అటుతెలంగాణలో బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్ధనల కోసం ఈద్గాలు, మసీదుల్లో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వార్ధాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుందని అన్నారు. త్యాగాలద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందన్న సందేశాన్ని బక్రీద్ విశ్వ మానవాళికి అందిస్తుందని తెలిపారు.