టీడీపీ-జనసేన పొత్తుపై సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ములాఖత్ లో మిలాఖత్ లు చేసుకున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మండి పడ్డారు సీఎం జగన్. తూ.గో జిల్లా నిడదవోలులో వైఎస్సార్ కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మందికి రూ.536.77 కోట్ల ఆర్థిక సాయం చేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… అవినీతి కేసులో అరెస్టైన మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెబుతా అన్నారు. ఇన్ని దొంగ తనాలు చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు దొంగలా ముఠా ఉంది.. కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే అంటూ చురకలు అంటించారు. సామాన్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో రాజకీయ నాయకులకు అదే వర్తిస్తుంది అని చెప్పేవాళ్లు చంద్రబాబుకు లేరన్నారు సీఎం వైఎస్ జగన్. ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు దొంగగా అడ్డంగా దొరికినా కూడా.. దోపిడీ సొమ్ము అని ప్రజలకు అర్థం అయినా కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించే వాళ్లు సిద్ధం అయ్యారని ఆగ్రహించారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏ ఒక్కరూ రెడీగా లేరు.. చంద్రబాబు దోచిన దాంట్లో వాటదారులు కాబట్టే అంటూ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహించారు.