ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోంది. అయితే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాల్సి ఉండగా.. సిబ్బంది ఆలస్యంగా వచ్చారు. సిబ్బంది రాక ఆలస్యం కావడంతో 9.30 గంటల వరకు కేంద్రాన్ని తెరవలేదు.
పోలింగ్ కేంద్రం తెరిచాక ఒకేసారి అధిక సంఖ్యలో ఉద్యోగులు లోపలికి ప్రవేశించడంతో గందరగోళం నెలకొంది. బూత్‌లోని పోలింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి ముగ్గురు, నలుగురు ఒకేసారి వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో రహస్యంగా వేయాల్సిన ఓటును.. ఓపెన్‌గానే వేశారు ఓటర్లు. మరోవైపు కొందరు నాయకులు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. అక్కడ పోలీసులు ఎవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పలు రాజకీయ పార్టీలు విస్మయం వ్యక్తం చేశారు. కనీసం పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలి కదా అని మండిపడ్డారు.