‘నవ సందేహాలు’ పేరుతో ఏపీ సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. ఈసారి ఆమె మద్యనిషేధం ప్రస్తావన తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మద్యనిషేధం హామీ అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. వారు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ పాక్షికంగానైనా అమలవుతోందా? అని నిలదీశారు. మూడు దశల్లో అమలు చేస్తామన్నారని.. నిషేధం తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామన్నారని గుర్తు చేశారు.
“మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని రూ.30 వేల కోట్లకు పెంచుకున్నారు. గతంలో మద్యంపై ఆదాయం.. ప్రజల రక్తమాంసాలపై వ్యాపారమన్నారు.. మరి మీరేం చేశారు? కనీవినీ ఎరగని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.11 వేల కోట్లు రుణాలెందుకు? డ్రగ్స్ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఎందుకుంది? 20.19 లక్షల మంది డ్రగ్స్‌కు అలవాలటు పడటం మీ వైఫల్యం కాదా?’’ అని వైఎస్ షర్మిల లేఖలో ప్రశ్నించారు.