గుంటూరు: ఆంధ్రప్రదేశ్ విభజనతో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కేడర్ పటిష్టంగా ఉందని ఆ పార్టీ నేలులు చెబుతుంటారు. ఉమ్మడి ఏపీలో అధికారం కోల్పోయి..విభజన శాపం ముటకట్టుకుంది కాంగ్రెస్. విభజన జరిగి 7 ఏళ్లు పూర్తి అయింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పరిస్థితులు మెరుగవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన లోకల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఆ పార్టీ మళ్లీ పునర్ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ అయ్యేందుకు కాంగ్రెస్ నేతలు కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసులతో పాటు మృతులు పెరుగుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్లు కొరత కొనసాగుతోంది. ఇందువల్ల ప్రతిఒక్కరికీ టీకాలు వేయలేకపోతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు నిచ్చింది. అందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. టీకాల కొరతను నిరసిస్తూ జూన్ 4న (రేపు) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
శైలజానాథ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘‘కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి పాలకులు అసమర్ధతను చాటుకున్నారు. కరోనా మరణాలను పూర్తిగా బయట పెట్టడంలేదు. గంగా నదిలో నుంచి శవాలు కొట్టుకొస్తున్నాయి. పల్లాలు, గంటలు కొడితే కరోనా పోతుందా?. టీకాలు పొందడం ప్రతి పౌరుడి జన్మహక్కు. ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు గతంలో ఉచితంగా టీకాలు వేసిన చరిత్ర కాంగ్రెసు పార్టీది. 8 కోట్ల డోసులను బయటదేశాలకు అమ్ముకున్నారు. వ్యాక్సిన్‌కు మూడు రకాల రేటు వ్యాపార దృక్పథం చాటుతోంది.’’ అని మండిపడ్డారు.
మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని శైలజానాథ్ అన్నారు. ‘‘మూడో వేవ్ వచ్చేలోగానే టీకా కార్యక్రమం పూర్తి చేయాలి. యూనివర్సల్ టీకా వేయాలనేది కాంగ్రెస్ డిమాండ్. అందరికీ టీకాలు ఇవ్వాలని 4న రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. ప్రతి నెల పేద కుటుంబాలకు రూ. 7,500 ఇచ్చి సాయం చేయాలి. సమస్యను వివరించేందుకు గవర్నర్ ను కలవనున్నాం. కరోనా ఖర్చుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. కరోనా మరణాలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోంది?. కరోనా సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.1000 కోట్లు ఇవ్వాలి. బడ్జెట్ సమావేశాల్లో కరోనాపై కనీసం చర్చించని అసమర్ధ ప్రభుత్వమిది.’’ అని శైలజానాథ్ విమర్శించారు.