ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే.. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కొవిడ్-19 తీవ్రత ఏపీలో తగ్గిపోతుండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించడం కాస్త ఊరటనిస్తోంది. అంతేగాక కొవిడ్ పాజిటివిటీ, మరణాల రేట్లు కూడా గణనీయంగా తగ్గాయని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. రికవరీ రేటు భారీగా పెరిగిందని, అన్ని జిల్లాల్లో మరణాలు తగ్గాయని వెల్లడించారు.
కొవిడ్–19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాదికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. పరీక్షల సరళి, బెడ్ల అందుబాటు, ఇతర మౌలిక సదుపాయాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇప్పటికే అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందులో భాగంగానే భారీగా వైద్యులు, సిబ్బందిని నియమించామని తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, రోజుకి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు 35,680, ట్రూనాట్ టెస్టులు 8,890 చేసే స్థాయికి చేరిందని వారు వెల్లడించారు.