ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపు వ్యవహారం నడుస్తోంది. ఈవీఎంలు, ఓటింగ్ సరళిపై అనుమానాలు వ్యక్తం చేశారు బాలినేని శ్రీనివాస్. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల మాక్ పోలింగ్ చేపట్టాలని ఎన్నికలు సంఘానికి ఫీజు చెల్లించారు బాలినేని. దీంతో ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంల్లో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు 26 మంది అభ్యర్థులు.
కానీ 34,060 ఓట్లతో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్. గతంలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ వచ్చింది. వైసీపీకి గట్టి పట్టున్న పోలింగ్ కేంద్రాల్లో కూడా టీడీపీకి మెజారిటీ రావడం గమనార్హం. తమకు గట్టి పట్టున్న చోట్ల కూడా టీడీపీకి మెజారిటీ రావటంతో ఓటింగ్ సరళి, ఈవీఎంలపై అనుమానాలున్నాయంటున్నారు బాలినేని. 12 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణకు 5.44 లక్షల నగదును ఎన్నికల సంఘానికి చెల్లించారు బాలినేని. దీంతో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే హైదరాబాద్‌లో శిక్షణ పొందిన కలెక్టర్ తమీమ్ అన్సారియా రెడీ అయ్యారు. మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. త్వరలోనే తేదీ ఖరారు చేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇస్తామన్నారు.