వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు కంపార్ట్‌మెంట్లు నిండిపోగా ఏటీజీహెచ్ వరకు బారులు తీరారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు సోమవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ఉపద్రష్ట, టీటీడీ వైఖాసన ఆగమసలహాదారు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ… బింబశుద్ధి కోసం పంచగవ్యాధివాసం నిర్వహించినట్టు తెలిపారు.
ముడిశిలను శిల్పులు చాకచక్యంగా స్వామి, అమ్మవార్ల విగ్రహాలుగా మలుస్తారని, ఈ క్రమంలో సుత్తి, ఉలి దెబ్బలకు వేదనకు గురయ్యే విగ్రహాలకు ఉపశమనం కలిగించామని చెప్పారు. ఇందుకోసం పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో అభిషేకం చేశామని వివరించారు. అనంతరం పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం నిర్వహించామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 24గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 82,582 మంది భక్తులు దర్శించుకోగా 43,526 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లు వచ్చిందని వెల్లడించారు.