ఐఎండి సూచనల ప్రకారం తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ రేపు తెల్లవారుజామునకు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని పేర్కోన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 24 అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 25 తెల్లవారుజాము లోపు ధమ్రా (ఒడిశా) సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందన్నారు.
కాబట్టి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి రేపు రాత్రి వరకు గంటకు 80-100కిమీ వేగంతో, అలాగే రేపు రాత్రి నుంచి 100-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.