అయిదేళ్లపాటు పడకేసిన పారిశ్రామికరంగాన్ని తిరిగి గాడిలో పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 25వ తేదీనుంచి వారం రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం.
ఇందులో భాగంగా ఈనెల 29 న లాస్ వేగాస్ లోని సీజర్స్ ప్యాలెస్ లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ “సినర్జీ” పేరుతో నిర్వహించే కీలకమైన వార్షిక సమావేశానికి మంత్రి లోకేష్ విశిష్ట అతిధిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి IT సేవల పరిశ్రమ నుండి 3వేల చిన్న & మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఎపి ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేష్ ను విశిష్ట అతిధిగా ఆహ్వానిస్తున్నట్లు సినర్జీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్ట్-అప్‌లకు మద్దతు ఇవ్వడంలో మీ చొరవ ఆర్థికాభివృద్ధిలో ఒక బెంచ్‌మార్క్‌ను ఆవిష్కరించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.