ఏపీ లోని అనకాపల్లి బాణాసంచా పేలుడు ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రం(లో ఆదివారం భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8 కి చేరింది. ప్రమాద ఘటనలోనే ఐదుగురు చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. కాగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు విశాఖ కేజీహెచ్ వైద్యులు తెలిపారు.
ఈ భారీ అగ్నిప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడి.. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, క్షతగాత్రుల పరిస్థితి పై పవన్ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. అయితే ప్రమాద ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పేలుడు జరిగిన ఫ్యాక్టరీ ప్రాంతంలో భీతావహ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.