గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. ప్రచార పిచ్చితో ఓ పత్రికకు రూ.1,600 కోట్ల ప్రజాధనాన్ని కట్ట బెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి బొక్కేసిన ఎగ్ పఫ్‌ల ఖర్చే అక్షరాలా రూ. 3 కోట్లన్నారు.
ఇవన్నీ చాలవన్నట్లు అభివృద్ధి పేరుతో చేసిన అప్పుల్లోనూ చేతి వాటం చూపారని మంత్రి రవికుమార్ ఆరోపించారు. రూ.పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేశారన్నారు. ఆరోగ్య శ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజ్ రియంబర్స్మెంట్లకు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.22 వేల కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం. చెల్లించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు పాలన కారణంగా రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని దుస్థితి దాపురించిందని విమర్శించారు.