వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక వైద్య సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా అదుపులోకొచ్చిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన వివరాలతో కూడిన సమాచారం అందించారు. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డయేరియా ప్రబలిన వెంటనే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతిని విజయనగరం జిల్లాకు హుటాహుటిన పంపించామనీ, అక్కడే ఉండి పరిస్థితిని ఆమె పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ను విజయనగరం జిల్లాకు ఆదివారం నాడు పంపించామన్నారు. స్థానిక వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డయేరియా వ్యాప్తికి గల కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించగా, కలుషితమైనట్లు తేలిందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడం వల్ల భూగర్భ జలం కలుషితమయ్యిందని, నీటిని సరఫరా చేసే పైపులు డ్రైనేజీ వ్యవస్థలో ఉండడం వల్ల లీకేజీ వలన కూడా తాగునీరు కలుషితమయ్యిందని స్థానిక అధికారులు వివరించారు. డీహైడ్రేషన్ బాగా ఉన్న డయేరియా కేసుల్ని చీపురుపల్లి సిహెచ్ సికి, విజయనగరం జిజిహెచ్, వైజాగ్ కేజిహెచ్ లకు తరలించారని, ఇంటింటికీ సర్వే చేసి అనుమానిత కేసుల్ని ఉచిత వైద్య శిబిరాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. నీరు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఖాధికారులకు సూచించారు. ప్రజలకు ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన నీరు అందజేయబడుతున్నట్లు వివరించారు.