జగన్ అక్రమాస్తుల కేసు.. భారతీ సిమెంట్స్‌ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

-

భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా భారతీ సిమెంట్స్‌ను ఆదేశించింది. ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

భారతీ సిమెంట్స్ తరఫున సుప్రీం కోర్టులో న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రూ.150 కోట్ల ఎఫ్డీలను ఈడీ ఎన్ క్యాష్ చేసుకుందని ఆరోపించారు. ఎఫ్డీలను ఎన్ క్యాష్ చేసుకోలేదని ఈడీ తరఫు న్యాయవాది సంజయ్ జైన్ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు.. ఎన్ క్యాష్ చేసుకున్నారో లేదో వారంలోగా అఫిడవిట్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారతీ సిమెంట్స్ అఫిడవిట్ వేశాక తమకూ వివరణకు అవకాశం ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ న్యాయవాది విజ్ఞప్తికి ధర్మాసనం అనుమతిస్తూ.. భారతీ సిమెంట్స్ అఫిడవిట్ దాఖలు చేశాకే తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news