బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు తాను వైకాపా గురించి మాట్లాడినట్లుగానే ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు. మనసు ఒక దగ్గర, మనువు ఒక దగ్గర అన్నట్లుగా తన పరిస్థితి ఎలాగైతే ఉందో… విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుగా ఉందన్నారు. ఈనెల 20వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో పొత్తుల గురించి చర్చించడానికి బీజేపీ నాయకత్వం ఢిల్లీకి ఆహ్వానించినట్లు మీడియా కథనాలను చూశాం అని అన్నారు.
20వ తేదీన కాకపోతే, 21వ తేదీన బీజేపీ అగ్ర నేతలతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమావేశమై పొత్తులపై చర్చించే అవకాశం ఉండవచ్చన్నారు. అటు నుంచి ఇటు, ఇటునుంచి అటు వైకాపా నాయకత్వం అభ్యర్థులను మారుస్తూ ఆటలు ఆడుతున్నారని, ఏకంగా అభ్యర్థులను జిల్లాలే మారుస్తున్నారని, అభ్యర్థులు దొరక్కపోతే ఏకంగా కర్ణాటక నుంచి అభ్యర్థిని దిగుమతి చేసుకున్నారని, టీడీపీ, జనసేన నాయకత్వం చెరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారని అన్నారు. మార్చి 10వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలి కాబట్టి అతి త్వరలోనే కూటమి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయవచ్చునని, అప్పుడు సాక్షి దినపత్రిక ఏమని ఏడుస్తుందో చూడాలన్నారు.