భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచిస్తుంది. దేశవ్యాప్తంగా కొంత మంది మాత్రమే ఆసక్తిగా ఓటు నమోదు చేసుకుంటున్నారు. మరికొందరూ అవగాహన లేకపోవడం, సుదూర ప్రాంతాలకు వెళ్లకపోవడం.. ఇలా రకరకాలుగా ఓటును నమోదు చేసుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా భారత ఎన్నికల కమిషనర్ జారీ చేస్తున్న ఓటర్ గుర్తింపు కార్డులు ఆంధ్రప్రదేశ్ లో తప్పుల తడకలుగా కనిపిస్తున్నాయి. అగనంపూడి నిర్వాసిత కాలనీ కొండయ్య వలసకు చెందిన పట్టా రమణ పేరుతో జారీ చేసిన కార్డుల్లో ఆయన పుట్టిన తేదీ 01-01-1800గా కార్డులో నమోదు కావడం గమనార్హం.
ఈ లెక్కన చూసుకుంటే.. ఆయన ప్రస్తుత వయస్సు 223 ఏళ్లు. ఇంత గుడ్డిగా కార్డులను జారీ చేయడం వల్లనే ఓ వ్యక్తి పేరుతో పలు చిరునామాల్లో ఓటర్ గా నమోదు అవుతుండటం.. దొంగ ఓట్లు, బినామీ ఓట్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికైనా ఎన్నికల సంఘం స్పష్టమైన విధానం అమలు చేయాలని కోరుతున్నారు.