పక్క రాష్ట్రంలో పార్టీ ఎందుకు? కేటీఆర్‌కు కౌంటర్లు!

-

ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో చెప్పాల్సిన పని లేదు. టి‌డి‌పి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమాలు చేశారనే ఆరోపణలు నేపథ్యంలో ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అయితే దీనిపై పూర్తి ఆధారాలు ఇంకా ఏవి తేలలేదు. కేవలం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ బాబుని అరెస్ట్ చేయించారని రాష్ట్ర వ్యాప్తంగా టి‌డి‌పి నేతలు, శ్రేణులు నిరసన తెలుపుతున్నారు.

తప్పు చేశారు కాబట్టే బాబు జైలు పాలయ్యారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అయితే బాబు అరెస్ట్ అక్రమమని రాష్ట్రంలో జనసేన, కమ్యూనిస్టులు టి‌డి‌పికి మద్ధతు ఇస్తున్నారు. అలాగే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా కొందరు నేతలు బాబు అరెస్ట్‌ని ఖండిస్తున్నారు. జాతీయ స్థాయి నేతలు కూడా స్పందిస్తూ..బాబుకు మద్ధతు ఇస్తున్నారు. ఇదే సమయంలో పక్కనే తెలంగాణలో అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీ పెద్దలు దీనిపై స్పందించడంలేదు.

తాజాగా దీనిపై కే‌టి‌ఆర్ మాట్లాడుతూ.. ‘పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాకు ఎలాంటి సంబంధం లేదు. అది వారి తలనొప్పి. మాకు సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. అయితే తెలంగాణకే బి‌ఆర్‌ఎస్ పార్టీ పరిమితమైతే కే‌టి‌ఆర్ చెప్పిన దానిలో తప్పు లేదని, కానీ టి‌ఆర్‌ఎస్ పార్టీని బి‌ఆర్‌ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని చూస్తూ..ఏపీలో కూడా పార్టీ పెట్టి..దానికి అధ్యక్షుడుని పెట్టారని, అలాంటప్పుడు ఏపీ రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం కే‌టి‌ఆర్‌కు ఉందని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు.

మరికొందరు ఏమో..పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారు..కానీ అక్కడ జరిగిన పరిణామాలపై స్పందించకపోవడం కరెక్ట్ కాదని..బాబు అరెస్ట్ సక్రమం లేదా అక్రమం అనేది చెబితే బాగుండేది అంటున్నారు. మొత్తానికి పక్క రాష్ట్రంతో తమకేం సంబంధం అంటున్న కే‌టి‌ఆర్..పక్క రాష్ట్రంలో పార్టీ ఎందుకు పెట్టారని ప్రశ్నలు ఎదురుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news