ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ సంస్మరణ సభకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2008లో తొలిసారి రామోజీరావును కలిశానని గుర్తు చేసుకున్నారు. రామోజీ ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారని, ఆయన మాట్లాడే విధానం తనను చాలా ఆకర్షించిందని తెలిపారు.
రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయన్న పవన్ కల్యాణ్, పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీ వివరించారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని అనే వారని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు వారసత్వాన్ని ప్రతీ జర్నలిస్టూ తీసుకోవాలన్నారు.