తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్జాగా దర్శించుకునేందుకు ఓ నకిలీ ఐఏఎస్ చేసిన ప్రయత్నాలను టీటీడీ అడ్డుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నరసింహారావు అనే వ్యక్తి నకిలీ ఐఏఎస్‌గా అవతారమెత్తి గురువారం స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నాడు. తాను ఐఏఎస్ అధికారినంటూ టీటీడీ ఈవో కార్యాలయంలో సిఫార్సు లేఖను అందించాడు. తాను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానని బుకాయించాడు.
లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన ఈవో కార్యాలయ అధికారులు అనుమానించి అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. వారి విచారణలో నకిలీ ఐఏఎస్‌గా తేలడంతో అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.