ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం త్వరలోనే అమల్లోకి తీసుకు వస్తున్నామని, రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోందని, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆదివారం తెనాలి నియోజకవర్గం పరిధిలో కాజీపేట, కొలకలూరు, ఎరుకలపూడి, కటెవరం, అంగలకుదురుల్లో సుమారు రూ.కోటి 65 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వ హామీల్లో ముందడుగు వేస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇచ్చిన హామీ లబ్ధిదారుల ఇళ్ళలో వెలుగును నింపుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్ సిక్స్ లో ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలెండర్లను అంధజేయడానికి శ్రీకారం చుడుతున్నాము. 23వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చిస్తాము. సూపర్ సిక్స్ కార్యాచరణలో ప్రధాన్యతగా పౌరసరఫరాల శాఖ నుంచి పథకం ప్రారంభం అవుతోంది. అర్హత వున్న ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. దీపావళి నుంచి ప్రారంభం అయ్యే ఈ పధకం ప్రతి కుటుంబంలోనూ వెలుగు నింపుతుంది. ప్రతి మహిళ గుర్తుపెట్టుకునే విధంగా అమలవుతుంది. ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి సుమారు రూ. 3000 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కూటమి ప్రభుత్వ పాలనదక్షతకు, చిత్తశుద్ధికి నిదర్శనం అని తెలిపారు