చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్లీనరీ సమావేశాలు రెండు సంవత్సరాలుగా జరుపుకో లేక పోయామని అన్నారు.
జూలై 8, 9 తేదీల్లో వైసిపి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. 95% ఎన్నికల హామీలు పూర్తి చేసిన ఘనత సీఎం వైయస్ జగన్ దే అని కొనియాడారు. కులం, మతం, పార్టీలు చూడకుండా పేదరికం చూసి వైఎస్ జగన్ పథకాలు అందిస్తున్నారని అన్నారు. తనపై బాధ్యతలు ఎక్కువగా ఉండటం వలన గడప గడపకు వెళ్ళలేకపోయాను అని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి. తన తరపున పార్టీ నాయకులు గడప గడపకు తిరుగుతున్నారని, వైసీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం వారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అని చెప్పారు.
ఏ సమస్యలు ఉన్నా తనకి నేరుగా సమాచారం అందిస్తే తక్షణం స్పందిస్తానని తెలిపారు. చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కావు.. అందుకే రోడ్లు పాడు అయ్యేవి కావన్నారు.చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయిన వారిని జన్మభూమి కమిటీల్లో వేసేవారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 500 హామీలు ఇచ్చి మానిఫెస్టో మాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి.