శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కోలాహలంగా మారాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో గుళ్లలో సందడి నెలకొంది. ఆలయ ప్రాంగణాలన్నీ అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. దీపకాంతులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతోన్నాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
ఆలయాల్లో అమ్మవార్ల విగ్రహాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం కాస్త డిఫరెంట్గా డెకరేట్ చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నోట్లకట్టల మధ్యలో అమ్మవారు దేదీప్యమానంగ వెలిగిపోతున్నారు. చాలా మంది యువత అమ్మవారితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.