తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయకంపితులయ్యారు. ఈరోజు ఉదయం.. వరంగల్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెల్లవారుజామున 4.45 నిమిషాలకు సుమారు 5 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో పలుచోట్ల ఇళ్లలోని వస్తువులు కదిలాయి. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతుందో అర్థం గాక భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించింది. మణుగూరులో ఈనెల 19న కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. ఆరు రోజుల వ్యవధిలోనే మళ్లీ రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉందని వాపోతున్నారు. అయితే భూ ప్రకంపనల వల్ల జరిగిన నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.