కరోనా తో ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో దూసుకుపోతున్నారు. తాజాగా రాష్ట్ర రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 81 శాతం ఫీడర్లలో ఈ ఏడాది ఖరీఫ్ నుంచి రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని అధికారికంగా అనిర్ణయం తీసుకుంది. 58 శాతం ఫీడర్లలో గత ఖరీఫ్‌లో పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించారు.
ఈ ఏడాది దీనిని 81 శాతానికి పెంచినట్టు జగన్ సర్కార్ పేర్కొంది. విద్యుత్ రంగంపై సిఎం జగన్ ఒక సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, జెన్కో ఛైర్మన్ సాయిప్రసాద్, జెన్‌కో ఎండీ శ్రీధర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పాల్గొనగా పలు సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. లాక్డౌన్ వల్ల విద్యుత్ పంపిణీలో ఇబ్బంది కలిగిందని, మిగిలిన 19 శాతం ఫీడర్లలో పనులు మందగించాయని జగన్ దృష్టికి తీసుకుని వెళ్ళారు.
వచ్చే రబీ నాటికి పనులన్నింటినీ పూర్తి చేసి 100 శాతం ఫీడర్లలో పగటిపూట 9 గంటల పాటు ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ సందర్భంగా జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై కూడా ఆయన ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించగా ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఈ నెల చివర్లో పనులు ప్రారంభిస్తామని జగన్ తో చెప్పుకొచ్చారు.