ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం మరిన్ని విద్యుత్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లుగా ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు లో మూడు యూనిట్లు, 2024 లో మరో మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
2026 నాటికి అన్ని యూనిట్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా గత కొన్ని రోజులుగా విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కరెంటు కోతల నేపథ్యంలో ఫిర్యాదు కేంద్రాలకు తెగ కాల్స్ చేస్తున్నారు ప్రజలు. కొందరు కనీసం ఏ ఏ సమయాల్లో కరెంటు పోతుందో చెప్పాలని వేడుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం ఈ సమస్యపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.