విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు వెంటనే వైద్యం అందించడానికి అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అంబులెన్స్, ఆసుపత్రి సిబ్బందితో కలిసి వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ముందు వారి వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆ వివరాలకు అనుగుణంగా బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు సంబంధిత వైద్యులు సిద్ధంగా ఉంటారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. బాధితులకు సంబంధించి సమాచారం లేకపోవడంతో వైద్యం అందించడం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. అంబులెన్స్, ఆసుపత్రి సిబ్బంది, సమన్వయంతో పని చేయడం ద్వారా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు.