ఏపీ ఉన్నత విద్యా శాఖలో పోస్టుల భర్తీ కసరత్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 295 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించింది ఉన్నత విద్యా మండలి. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.హేమచంద్రా రెడ్డి మాట్లాడుతూ… 2009 తర్వాత మొదటి సారి యూనివర్సిటీల్లో నియామకాలు జరుగుతున్నాయని… 2018లో నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు కేసులు వల్ల ప్రక్రియ ముందుకు వెళ్ళలేదని వెల్లడించారు.
18 యూనివర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీ జరుగనుందని.. వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ డిసెంబర్ నాటికి రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తామని.. ప్రస్తుతం అన్ని యూనివర్సిటీల్లో వెయ్యి మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారని ప్రకటించారు. ప్రపంచానికి ఆదర్శం కావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని.. యూజీసి నిబంధనల ప్రకారం యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని రెగ్యులర్ చేయలేమన్నారు. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి వారు పని చేసిన కాలానికి 10 శాతం వెయిటేజ్ ఇస్తున్నామని వివరించారు.