ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ తెలుగు, సాంస్కృతిక అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ భార్యగా తనకి ఉన్న గుర్తింపు తొలగించేందుకు పురందేశ్వరి, చంద్రబాబు కలిసి కుట్ర చేస్తున్నారని వండిపడ్డారు. ఎన్టీఆర్ స్మారక నాణాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్యగా తనను ఆహ్వానించకపోవడం దుర్మార్గం అన్నారు. ఇకనుంచి తన పోరాటం పురందేశ్వరి పైనేనని అన్నారు లక్ష్మీపార్వతి.
తండ్రికి వెన్నుపోటు పొడిచి కుటుంబ సభ్యులుగా చలామణి అవుతారా..? అని ప్రశ్నించారు. పురందేశ్వరి చంద్రబాబు తో కలిసి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇకనుండి పురందేశ్వరి తిరిగే ప్రతి నియోజకవర్గంలో తిరుగుతానని.. ఒక్క సీటు కూడా రాకుండా చేస్తానని సవాల్ చేశారు. తనకి జరిగిన అవమానం ఏదో ఒక రోజు ఆమెకు కూడా జరుగుతుందన్నారు. పురందేశ్వరి అత్యంత అవినీతిపరురాలని ఆరోపించారు. ఎన్టీఆర్ నాణాన్ని అందుకునే అర్హత వారికి లేదన్నారు.