చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో అన్న చందంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేకపోయిందని, ఓటాన్ అకౌంట్ తో ఇన్నాళ్లు నడిచే ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు గడుస్తున్నా సూపర్ 6 లేదు.. సూపర్ 7 లేదని దుయ్యబట్టారు.
ప్రజలు నిలదీస్తారని భయపడి.. కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశ పెడితే సూపర్-6 ఎక్కడ అని ప్రజలు అడుగుతారని భయం బాబును వెంటాడుతుందని అన్నారు. వైసీపీ హయాంలో మాదిరి.. బాబు అయిదు నెలల్లో డీబీటీ ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు. ఇసుక, మద్యం, ఎక్కడ చూసినా దోపిడియే. కప్పం కట్టనిదే పనులు జరగడం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా దోచుకో పంచుకో తినుకో మాఫియా నడుస్తోంది. చంద్రబాబు అబద్దాలకు రెక్కలు కట్టాడని తెలిపారు. * రూ. 10 వేలు జీతమని చెప్పి వాలంటీర్లను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.