తిరుమల శ్రీవారి సన్నిధిలో వివిధ శాఖల సిబ్బంది విధివిధానాలేంటో మీకు తెలుసా.. అసలు తిరుమలేశుడికి ఎంత బంగారం ఉందో తెలుసా.. పోనీ.. శ్రీవారి ప్రసాదాల్లో ఎంత నెయ్యి వినియోగిస్తారో అదైనా తెలుసా.. ఈ విషయాలు తెలియకపోతే ఈ స్టోరీ చదివేయండి. వారణాశిలో జరిగిన అంతర్జాతీయ ఆలయాల సమావేశంలో పాల్గొన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమలకు సంబంధించిన ఆసక్తికర సమాచారం వెల్లడించారు.
తిరుమల శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాలు 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉంటుందని ఈవో వివరించారు. ఏడాదికి శ్రీవారికి 500 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీలో 24500 మంది ఉద్యోగులు ఉండగా, ఆలయంలో భక్తులకు సేవలందించడానికి రోజుకి 800 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఏటా 500 టన్నుల నెయ్యి వినియోగిస్తామని వివరించారు. స్వామి పేరుతో రూ. 17వేల కోట్ల నగదు, 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్ చేశామని వివరించారు. ఈ సమావేశంలో 30 దేశాల నుంచి వచ్చిన 1600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.