విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ 90 వసంతాల వేడుక నిర్వహించారు. అంకోసా హాల్లో ‘నవతీ ప్రసన్నం’ పేరిట నిర్వహించిన ఈ వేడుక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశిష్ట అతిథిగా మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సెంటర్ ఫర్ పాలసీ వ్యవస్థాపకులుగా ఏయూ రెక్టార్ గా క్రికెట్ టెన్నిస్ వ్యాఖ్యాతగా ప్రొఫెసర్ ప్రసన్న కుమార సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
ఎంతకాలం బ్రతికామని కాదు ఎలా బ్రతికం అనేది చాలా ముఖ్యమని వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఆనందకర జీవితము అందరూ కోరుకుంటారు దానిని సాధ్యం చేసుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. వ్యక్తి ఆలోచనకు సానుకూల ధోరణి చాలా అవసరం. యువకులు ప్రకృతితో కలిసి జీవించాలి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. మరణించిన తర్వాత జీవించాలి అంటే సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలి. విశాఖలో తెన్నేటి విశ్వనాథం పరిచయంతో తన జీవన శైలి మారిందని తెలిపారు విశాఖలో ప్రముఖుల వల్ల తన జీవితంలో ఉన్నత శిఖరాలను చూడగలిగానని తెలిపారు.