శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్త లింగమయ్య తలకు బలంగా గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో లింగమయ్య మరణించాడు.
దీంతో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యను ఆ పార్టీ అధినేత జగన్ ఖండించారు. లింగమయ్యను పొట్టన పెట్టుకున్నారని, అన్యాయాలను ప్రశ్నించినందుకే హత్య జరిగిందన్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు పరిపాటిగా మారాయని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వ్యాఖ్యానించారు. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.