కూటమి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని. శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు.. కానీ మోసపు మాటలు మాత్రం లేవన్నారు. కొందరు చెబుతున్నట్లు ఈవీఎంలను మోదీతో కలసి మోసం చేసి ఉండవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ జనాన్ని మోసం చేయటానికి గోధుమ రంగు పంచ కట్టలేదు.. ఎర్ర లుంగీ కట్టలేదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నాకు కులం లేదు అని మొన్న చెప్పి.. ఇవాళ కులం ఉంది, మతం ఉందని డ్రామా మాటలు జగన్ ఏ రోజు చెప్పలేదన్నారు. చంద్రబాబుకు అధికారం ఏమైనా శాశ్వతంగా ఉందా..? చంద్రబాబులా ఎవరి సాయంతోనూ జగన్ అధికారంలోకి రాలేదు.. సింగిల్ గా వచ్చాడన్నారు.
జనానికి మేలు చేయాలనే తపనలో కార్తకర్తల్ని పట్టించుకోలేక పోయామని జగన్ కూడా భాద పడుతున్నారని చెప్పుకొచ్చారు మాజీమంత్రి పేర్ని నాని. కార్యకర్తలు చెప్పిన పనులు చేశాం.. కానీ కార్యకర్తల ఇబ్బందులు చూడలేదనే భాద ఉందన్నారు. 2019లో జగన్ కు 151 సీట్లతో అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలేనని.. 2029లో 175 సీట్లతో తిరిగి అధికారంలోకి తెచ్చేది కార్యకర్తలేనన్నారు.