పేదలకు – ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌ న్యూస్!

-

కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా సగం జీతాలు మాత్రమే తీసుకుంటున్న ఎంప్లాయిస్ కష్టాలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం వారికి ఊరట నిచ్చింది. ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. అవును… లాక్‌ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే చెల్లించారు. ఈ విషయంలో గడిచిన రెండు నెలల బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జగన్ స్పష్టం చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ లో ఏపీ సీఎం ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులు ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే.. వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. ఇందులో భాగంగా మరో 15 రోజులు సమయమిచ్చి దరఖాస్తులు తీసుకోవాలని, పరిశీలన అనంతరం గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు!

ఈ క్రమంలో మే 6 నుంచి 21 వరకూ జాబితాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని, ఆ తర్వాత మరో 15 రోజుల పాటు పరిశీలించి జూన్‌ ఏడులోగా తుదిజాబితాను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జులై 8న అర్హులకు 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ చెప్పారు. మరోవైపు.. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏమైనా కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే, వెంటనే ఆ పని చేయాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news