త్వరలోనే సొంత పత్రిక, సొంత టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచనతో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల నుండి కూడా పవన్ కళ్యాణ్ మీద ఎప్పటి నుండో వస్తున్న ఒత్తిడికి సమాధానంగానే జనసేన తదుపరి చర్యలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. జనసేన పార్టీ వాణిని వినిపించడానికి తీసుకున్న 99 టీవీ ఛానల్ ఆ పనిని సమర్థవంతంగా చేయలేకపోతుందని నమ్ముతున్న పవన్.. ఇదే క్రమంలో ఆంధ్రప్రభ పత్రిక అధినేత కుటుంబీకులు, ఏపీ 24/7 ఛానల్ కి చెందిన కొందరు వ్యక్తులు జనసేన పార్టీలో ఉండడం వల్ల ఆ రెండు సంస్థలు కొంత వరకు జనసేన కార్యక్రమాలకు కవరేజ్ ఇచ్చినా, అది కూడా సరిపోవడం లేదని బలంగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కు సొంత మీడియా ఆలోచన తట్టిందట!
నిజానికి పార్టీ పెట్టిన కొత్తల్లో పవన్ కు అన్ని మీడియా ఛానల్స్, పత్రికలనుంచి సంపూర్ణ మద్దతు లభించిందనే చెప్పాలి. ఇదే క్రమంలో 2014లో జనసేన పార్టీ ప్రారంభించిన మొదట్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడంతో, మూడేళ్లపాటు “ఆ వర్గం” మీడియా ఛానల్స్ ఫుల్ కవరేజ్ ఇచ్చాయి. కాని పవన్ తో టీడీపీ బంధం తెగిపోగానే.. ఆ మీడియా దృష్టిలో పవన్ పని కూరలో కరివేపాకు, ఆటలో అరటిపండుగా మారిపోయింది! పవన్ కు కనీస కవరేజ్ కూడా ఇవ్వడం మానేసింది ఆ మీడియా! ఈ పరిస్థితుల్లో ఇంక వారినీ వీరినీ నమ్ముకోవడం కంటే… సొంత పత్రిక, టీవీ ఛానల్ ను నడుపుకోవడమే మంచిదన్నట్లుగా పవన్ భావిస్తున్నారంట!
ఒకవేళ సొంత మీడియా లేకుండా 2024 ఎన్నికలకు వెళితే, 2019 ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదన్న భావన జనసేన అభిమానులనుండి వ్యక్తమవుతున్న నేపథ్యంలో… పవన్ ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో పవన్ చేసే ప్రతి కార్యక్రమాన్ని “శతఘ్ని టీమ్”, అభిమానులు ఎంత బలంగా ముందుకు తీసుకెళుతున్నా అది ఓటు బ్యాంకుగా మారే స్థాయి ప్రభావాన్ని చూపించలేదనేది పవన్ నమ్మకంగా ఉందంట! దీంతో… ఇది ఎంత సోషల్ మీడియా యుగం అయినప్పటికీ… ప్రధాన మీడియాలో వచ్చే వార్తలకు ఉండే విశ్వసనీయత, సోషల్ మీడియాకు లేదన్న సంగతి పవన్ బాగా గ్రహించారని చెబుతున్నారు!