జేసీ ఆ రేంజ్ లో చెప్పాడు… బాబుకు అర్ధం అయ్యిందా?

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన రాజకీయ స్టైల్ విభిన్నంగా ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డికి పేరు!! మరో విషయం ఏమిటంటే… ఆయన ప్రత్యర్థి పార్టీల కంటే సొంతపార్టీలపైఅనే ఎక్కువగా విమర్శలు గుప్పిస్తుంటారని కూడా పేరు సంపాదించుకున్నారు! ఈ క్రమంలో తాజాగా మైకుల ముందుకు వచ్చిన మాజీ ఎంపీ – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి… ఒకవైపు జగన్ చేసిన “పోతిరెడ్డిపాడుపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్” పనికి అభినందిస్తూ జై కొడుతూ.. బాబు చేస్తున్న పనిపై మాత్రం విమర్శలు గుప్పించారు! ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అవ్వగా… ప్రతిపక్షాల కంటే ఎక్కువగా జేసీనే చంద్రబాబు గాలి తీసేశారని టాక్ వినిపిస్తుంది!!

గత రెండు నెలలుగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దూరంగా ఉంటున్న చంద్రబాబు… డైలీ వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఆన్ లైన్ లో రాజకీయాలు చేస్తున్నారు! ఈ క్రమంలో ఏపీలో విద్యుత్ బిల్లులు పెరిగాయని.. ఈ వ్యవహారంపై దీక్షలు చేయాలని నిర్ణయించారు బాబు! కరోనా సమయంలో ఇళ్లు వదిలి బయటకురాని ఈ ప్రజానాయకుడు ఈ సమయంలో దీక్షలు ఎలా చేస్తారబ్బా అని కొందరు అనుమానించారు! వెంటనే బాబు ఈ విషయంపై స్పందించి.. ఇంటిలోనే ఉండి దీక్షలు చేయాలని ప్రకటించారు! సరిగ్గా ఈ వ్యవహారంపైనే జేసీ దివాకర్ రెడ్డి స్పందించి.. బాబు గాలి తీసేశారు!

విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయని ఆరోపిస్తూ టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలపై దివాకర్ రెడ్డి స్పందించారు. టీడీపీ చేస్తున్న దీక్షల్ని తప్పుబట్టిన ఆయన… ఇంట్లో ఉండి దీక్ష చేస్తే ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దీక్ష ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని జేసీ పేర్కొన్నారు. ఇంట్లో ఉండి దీక్షలు చేస్తే ఎవరైనా నమ్ముతారా అంటూ సందేహం వ్యక్తం చేశారు! పాపం బాబు ఏన్నో ఆలోచనలు చేసి ఇలా ప్లాన్ చేస్తే… ఒక్క మాటతో బాబు ప్లాన్, ఇంట్లో చేస్తోన్న దీక్షలపై ఒక్క మాటలో తేల్చేసి గాలి తీసేశారు జేసీ! ఆయన అన్నారని కాదు కానీ… ఇలాంటి దీక్షల వల్ల ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఏమిటో.. ప్రభుత్వంపై పెరిగే ఒత్తిడి ఏమిటో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకే తెలియాలి!!

ఇక్కడ మరో విషయం ఏమిటంటే… పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబరు 203 పై ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పాజిటివ్ గా స్పందించగా… ఇప్పుడు ఈ మాజీ ఎంపీ – టీడీపీ సీనియర్ నేత జేసీ కూడా పాజిటివ్ గా స్పందిస్తూ జగన్ కు జై కొట్టారు! కానీ… ఈ విషయంపై తన అభిప్రాయం ఏమిటనేది చంద్రబాబు ఇప్పటివరకూ చెప్పలేదు!!