వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 లో మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ, వైసిపి నాయకుడు నందిగం సురేష్ ని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో నందిగం సురేష్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఆయన పిటిషన్ ని కొట్టివేసింది.
దీంతో తుళ్లూరు పోలీసులు ఆయనని అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్ళగా.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూశారు. ఆ తర్వాత వెనక్కి వచ్చారు. అనంతరం సురేష్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆయన ఎక్కడ ఉన్నారో ఆరా తీసి చివరికి హైదరాబాదులో ఉన్నారని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాదు నుండి మంగళగిరికి తరలించారు.
అయితే తాజాగా మరోసారి సురేష్ హైకోర్టును ఆశ్రయించగా.. దీనికి సంబంధించిన విచారణ ఈ రోజు పూర్తయింది. ఇరువైపులా వాదనలు విన్న ఏపీ హైకోర్టు నందిగం సురేష్ పిటిషన్ పై తీర్పును ఈ నెల నాలుగు కు వాయిదా వేసింది. అయితే సురేష్ కి బెయిల్ ఇవ్వద్దని, ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉందని ప్రభుత్వ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.