ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్ 172 బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించారని, ఇదే విషయమై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రామ్మోహన్ నాయుడు గారి లేఖపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో మార్గదర్శి కేసులోనూ సంజయ్ ఇదే రీతిలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై తాను కూడా కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు.
172 బిజినెస్ రూల్స్ ప్రకారం ఎవరైనా పోలీస్ అధికారి తాను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసు వివరాలు బయటకు చెప్పకూడదని స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, అయినా సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తో కలిసి ఊరు ఊరు తిరుగుతూ ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేశారని అన్నారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కేసు డైరీ సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, అయితే కేసు డైరీని ముందస్తుగా కాకుండా, కేసు విచారణ జరిగే రోజే అందజేయాలని సూచించడం జరిగిందని అన్నారు. స్కిల్ కేసులో, మార్గదర్శి కేసులోనూ సంజయ్ ఎంతో ప్రాధాన్యత కలిగిన కేసు డైరీలను పట్టుకొని ఊరు, ఊరు తిరిగారన్నారు. సంజయ్ సర్వీస్ రూల్స్ ఉల్లంఘనపై టీడీపీ వారితో పాటు తాను కూడా కేంద్రానికి ఒక లేఖ రాస్తానని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు.