విద్యుత్ కోతలపై కీలక ప్రకటన చేశారు ఏపీ ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎంత ఖర్చయినా సరే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ తగినంత విద్యుత్ లభ్యత లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నారు. తప్పని సరై, విధిలేని పరిస్థితుల్లోనే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని వెల్లడించారు. తాత్కాలికంగా ఏర్పడిన విద్యుత్ కొరత సమస్యను ప్రజలు అర్థం చేసుకుంటారన్న నమ్మకం మాకు ఉంది.
నెలాఖరుకల్లా విద్యుత్ కొరత తీరుతుందని వివరించారు. ఏపీలో వేసవి కారణంగా విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగిందని చెప్పారు. 2018-19లో 63,605 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం అది 68,905 మిలియన్ యూనిట్లకు చేరింది. అంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా 8.33% చొప్పున డిమాండ్ పెరిగిందన్నారు. అదే సమయంలో బొగ్గు లభ్యత భారీగా పడిపోయిందని.. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోను ఏపీలో గృహ అవసరాలకు నిరంతరం, వ్యవసాయానికి ఏడుగంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తకుండా చేసేందుకు విద్యుత్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని స్పష్టం చేశారు.