టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో చంద్రబాబును ఆదివారం అర్ధరాత్రి దాటాక రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. రెండ్రోజుల నుంచి చాలా మంది నేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీ బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల వైఖరిపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నివాసముంటున్న మాగుంట లేఔట్‌ను అష్టదిగ్బంధం చేశారని .. తనను మూడు రోజులుగా నిర్బంధించి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
మూడు రోజులుగా మాగుంట లేఔట్‌ను అష్టదిగ్బంధం చేశారని.. తన వల్ల వందలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని.. తనను రమ్మంటే ఏ పోలీస్‌స్టేషన్‌కైనా వస్తానని.. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకండని పోలీసులను కోటం రెడ్డి కోరారు. “నన్ను అక్కడైనా అరెస్ట్ చేయండి. గృహనిర్బంధం పేరుతో నా సిబ్బందిని కూడా రాకుండా చేస్తున్నారు’’ అని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.