దురంతో రైలు పట్టాల నుంచి పరుగులు మొదలుపెట్టింది. కాలానికి ఎదురీదుతున్నట్లు వేగంగా పరుగు తీస్తోంది. ఇంతలో తెలవారుతోంది. అప్పుడప్పుడే చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో రైలులో సత్యవతి అనే ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఏం చేయాలో పాలుపోక ఆమె భర్తతో సహా అక్కడున్న వారంతా కనిపించిన వాళ్లని సాయమడిగారు.
దేవుడే పంపించాడనిపించేలా.. అదే బోగీలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల విద్యార్థిని స్వాతిరెడ్డి స్పందించి సత్యవతిని పరీక్షించారు. తోటి మహిళల సాయంతో పురుడు పోశారు. సత్యవతి పండంటి ఆడబిడ్డ జన్మించింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి విశాఖ బయల్దేరిన దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
సత్యవతి, సత్యనారాయణలది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నం గ్రామం. స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దాటగానే కాన్పు అయింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌కు విశాఖ వెళ్లేదాకా ఎక్కడా హాల్ట్ లేదు. సత్యవతి పరిస్థితి గురించి టీటీఈ అందించిన సమాచారం మేరకు అనకాపల్లిలో స్టేషన్‌మాస్టర్ వెంకటేశ్వరరావు రైలును ఆపించారు.
108 అంబులెన్స్‌లో తల్లీబిడ్డలను స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. గైనకాలజిస్టు అనూరాధ తల్లీబిడ్డకు వైద్యపరీక్షలు చేశారు. బిడ్డకు వైద్యసహాయం అందేవరకు స్వాతిరెడ్డి వారి వెన్నంటే ఉన్నారు. ఆమెకు సత్యవతి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.