విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఓ మిరాకిల్ చోటు చేసుకుంది. ప్రాణం లేకుండా జన్మించిన శిశువులో దాదాపు ఎనిమది గంటల తరువాత చలనం వచ్చింది. వెంటనే చిన్నపిల్లల విభాగంలోని ఎన్ఐసీయూ కి తరలించారు డాక్టర్లు. అక్కడి చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. చనిపోయాడనుకుని తీవ్ర దు:ఖంలో ఉన్న ఆ శిశువు తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
వివరాల్లోకి వెళ్లితే.. విశాఖపట్నం నగరానికి చెందిన ఓ గర్భిణీ పురిటి నొప్పులతో కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరారు. వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం చేశారు. మగబిడ్డ జన్మించినప్పటికీ.. బరువు తక్కువగా ఉండటంతో డాక్టర్లు అత్యవసర సేవలు అందించారు. ఎనిమిది గంటల పాటు శ్రమించారు. శిశువుకు ఊపిరి ఆడలేదు. వైద్యులు పరిశీలించి ప్రాణం పోయిందని చెప్పారు. కుటుంబ సబ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. శిశువు మరణించినట్టు ఆసుపత్రి రికార్డులలో కూడా సిబ్బంది ఎంట్రీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది శిశువును తండ్రికి అప్పగించారు. శిశువును ఇంటికి తరలించేందుకు తండ్రి అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో శిశువులో కదలికలు రావడానికి కుటుంబ సభ్యులు గుర్తించారు. వైద్యులకు సమాచారం అందించడంతో వెంటనే వారు స్పందించి పీడియాట్రిక్ విభాగంలోని ఎన్ఐసీయూకి తరలించి చికిత్స అందించారు.