నిలకడగా ఎంపీ అవినాష్‌ తల్లి ఆరోగ్యం.. ఈరోజు డిశ్చార్జ్‌

కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంపై కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడిందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇవాళ ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కానున్నారని తెలిపారు. అనారోగ్య కారణాలతో ఈనెల 19న ఆమెను కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.

గత వారం రోజులుగా చికిత్స అందించిన వైద్యులు తాజాగా మరో హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇవాళ డిశ్చార్జ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు హైదరాబాద్‌ బయల్దేరారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడిన నేపథ్యంలో కర్నూలు నుంచి ఆయన వెళ్లారు. అవినాష్‌ హైదరాబాద్‌ బయల్దేరిన సమయంలో పెద్ద ఎత్తున ఆయన అనుచరులు అక్కడికి చేరుకున్నారు.

మరోవైపు హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్​పై వాదనలు మొదలయ్యాయి. అవినాష్ తరఫున ఆయన న్యాయవాది ఉమా మహేశ్వర రావు వాదనలు వినిపిస్తున్నారు. ఇవాళ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.