పవన్ కళ్యాణ్ ఓ వీధి రౌడీ అని ఫైర్ అయ్యారు ముద్రగడ పద్మనాభం. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడాలని ఎమ్మెల్యేలను తిట్టడానికి సమయాన్ని వృధా చేయొద్దని పవన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘వీధి రౌడీలా మాట్లాడడం ఎంతవరకు సబబు? మీ ప్రసంగాల్లో తొక్క తీస్తా, నార తీస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు.
ఇప్పటివరకు ఎంతమందికి ఇలా చేశారో చెప్పండి’ అని ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారని వారాహి యాత్రలో పవన్ చేసిన వాక్యాలపై ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు. ‘నేను కులాన్ని అడ్డుపెట్టుకొని నాయకుడిగా ఎదగలేదు. యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదు. ప్రభుత్వం మారినప్పుడు ఉద్యమాలు చేయలేదు. మీరు నాకంటే బలమైన నేత కదా… నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి మీరు కాపులకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదు’ అని నిలదీశారు.