పొత్తుల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్సేషనల్ స్కెచ్ వేసినట్లు కనిపిస్తున్నారు. వారి వ్యూహాలు ఏ మాత్రం అర్ధం కాకుండా ఉన్నాయి. మొన్నటివరకు పొత్తు ఉన్నట్లు నడిచారు..ఇప్పుడు పొత్తు లేనట్లు ఎవరికి వారు సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇదంతా పెద్ద వ్యూహామని మాత్రం అర్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే పొత్తు దిశగా ఇద్దరు నేతలు పలుమార్లు భేటీ అయ్యారు.
ఇక అరాచక పాలనని సాగిస్తున్న జగన్‌ని గద్దె దించుతామని, అందుకు పొత్తు తప్పనిసరి అని, తనకు సిఎం పదవిపై ఆశ లేదని, బలం లేకుండా పదవి అడగకూడదని పవన్ ఆ మధ్య మాట్లాడారు. దీంతో పొత్తు ఖాయమైంది. ఇక బిజేపి కూడా కాస్త అనుకూలంగా మారింది. టిడిపి, జనసేనలతో బిజేపి కూడా కలుస్తుందని ప్రచారం నడిచింది. ఈ క్రమంలో తాను ప్రజల కోసం మంచి పనులు చేస్తుంటే తనపై కుట్రలు చేస్తున్నారని., తోడేళ్లు గుంపు ఏకమై తనపై దాడికి వస్తున్నాయని, ప్రజలే తనకు రక్షణగా ఉండాలని జగన్ ప్రచారం చేశారు.
ఈ అంశంలో జగన్ కాస్త సెంటిమెంట్ వర్కౌట్ అయింది. పైగా వైసీపీ నేతలంతా..కాపుల ఓట్లని బాబుకు తాకట్టు పెడుతున్నారనే ప్రచారం చేశారు. ఇటు సిఎం పదవి వద్దని చెప్పినందుకు జనసేన శ్రేణులు పవన్ పైనే అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిణామాలు పొత్తు అంశానికి ఇబ్బందిగా మారాయి. అందుకే ఒక్కసారిగా బాబు, పవన్ వ్యూహం మార్చేశారు.
ప్రస్తుతం వారు ఎవరికి వారే అన్నట్లు రాజకీయం చేస్తున్నారు. పొత్తు లేనట్లే సింగిల్ గా ముందుకెళుతున్నారు. అయితే సింగిల్ బలపడి..ఎన్నికల సమయంలో వీరు ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటారని, అప్పటివరకు పొత్తుల గురించి మాట్లాడకుండా..వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని బాబు, పవన్ కలిసే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అందుకే పొత్తులపై ఇప్పుడేమీ మాట్లాడటం లేదు. ఎన్నికల సమయంలో ఖచ్చితంగా పొత్తులు ఉండనున్నాయి. అప్పటివరకు వీరు ఇదే వ్యూహంతో వెళ్తారు.