కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయాన్ని బడ్జెట్‌లో కేటాయించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అలాగే విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారంతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు.. ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో బడ్జెట్పై ఏపీకి ప్రాధాన్యం కల్పించడంపై మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీయే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు’’ అని లోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.