14వ ఆర్ధిక సంఘం నిధులనేవి ముగిసిన అధ్యాయమని చెప్పి షాకిచ్చారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే విషయాన్ని ఏపీ రాష్ట్ర ఆర్ధిక మంత్రికి చెప్పామన్న ఆమె 15వ ఆర్ధిక సంఘం అమల్లోకి వచ్చి ఏడాదైందని అన్నారు. 14వ ఆర్దిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లపై ఆలోచిస్తామని ఆమె అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ మెరుగయ్యే సూచనలు కన్పిస్తున్నాయన్న ఆమె రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ బిల్లులకు సవరణలు చేశామని అన్నారు. కనీస మద్దతు ధరలను ఎక్కువ ఉత్పత్తులకు కల్పిస్తున్నామని, గతంలో వరి, గోధుమ పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర ఉండేదని దీని కారణంగా పప్పు ధాన్యాల సాగు పడిపోయిందని అన్నారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కనీస మద్దతు ధరలు అందించే వ్యవసాయ ఉత్పత్తుల జాబితాను పెంచామని ఆమె అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున నిల్వ చేసుకునే వెసులుబాటు కలుగుతోందని ఆమె అన్నారు. కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని, అవి రైతు పార్టీలు కాదు.. రాజకీయ పార్టీలని అన్నారు. మా మేనిఫెస్టోను అమలు చేస్తుంటే.. ఇదే హామీ ఇచ్చిన విషయాన్ని మరిచి కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తాను పండించిన పంటకి మార్కెట్ బాగుంటే అక్కడకి వెళ్లొద్దని రైతులని కట్టడి చేయడం సరికాదని ఆమె అన్నారు.