అమెరికాలో ప్రమాదంలో మృతి.. మరణానంతరం జాహ్నవికి డిగ్రీ

-

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మరణించడం.. ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భారత్‌.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. మరోవైపు దీనిపై కేటీఆర్ కూడా స్పందించి ఈ ఘటనపై దర్యాప్తునకు అమెరికాకు విజ్ఞప్తి చేయాలని కేంద్ర మంత్రి జైశంకర్​ను కోరారు. ఇదిలా ఉండగా జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ నిర్ణయించింది.

జాహ్నవి మృతిపై యూనివర్సిటీ ఛాన్సలర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన, దాని అనంతరం జరిగిన పరిణామాలతో తమ క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారని తెలిపారు. ఈ సమయంలో వారికి తాము అండగా ఉంటామని.. ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు.. ఆమె కుటుంబంసభ్యులకు దాన్ని అందజేస్తామని ఛాన్సలర్ వెల్లడించారు.

కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి(23) సౌత్‌ లేక్‌ యూనియన్‌లోని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీలో చేరింది. ఈ ఏడాది జనవరి 23న రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టడంతో జాహ్నవి మరణించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version